యాదాద్రి జిల్లాలో పులి కలకలం: దత్తాయపల్లిలో దూడపై దాడి
ఇది కద నిజం,తుర్కపల్లి/యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో పులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. మండలంలోని దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్ గ్రామ పరిసరాల్లో పులి తిరుగుతోందన్న వార్తలతో రైతులు, గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా దత్తాయపల్లికి చెందిన గొట్టే శ్రీశైలం అనే రైతు పశువులను మేపుతుండగా, పులి ఒక్కసారిగా దాడి చేసి ఒక లేగ దూడను పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనను కళ్లారా చూసిన రైతు, పశువులు భయంతో అక్కడి నుండి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై (SI) తైకొద్దిన్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, రేంజ్ ఆఫీసర్ల బృందం అక్కడకు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించింది. పులి కదలికలను కనిపెట్టేందుకు అమలాబాద్ నుండి ప్రత్యేక ‘టైగర్ ఫుట్ ట్రాకర్స్’ (పులి అడుగుజాడలను గుర్తించే నిపుణులు)ను రప్పించారు. పులి సంచరించిన ఆనవాళ్లను సేకరించడంతో పాటు, నిఘా కోసం అటవీ ప్రాంతంలో సోలార్ సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. పులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ మరియు పోలీసు యంత్రాంగం దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్ గ్రామస్థులను అప్రమత్తం చేసింది. రైతులు, కూలీలు పొలం పనులకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకూడదని, గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్లాలని సూచించారు. చీకటి పడకముందే పనులు ముగించుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం అటవీశాఖ బృందాలు పులిని పట్టుకునేందుకు లేదా అడవిలోకి పంపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
