ఉప్పర్ పల్లిలో ఘనంగా అయ్యప్ప పడి పూజ
భక్తిబావంతో పాల్గొన్న భక్తులు.. విశేష ఆకర్షణగా గురుస్వాముల పూజా కార్యక్రమం
ఇది కద నిజం, ఉప్పర్ పల్లి: స్థానిక అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం శనివారం భక్తి, శ్రద్ధ, ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్ప పడి పూజ ఈసారి మరింత వైభవోపేతంగా, ఆధ్యాత్మికతతో కూడిన వాతావరణంలో జరిగింది. గోల్కొండ శ్రీకాంత్ గురు స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజకు ప్రాంతం నలుమూలల నుంచి భక్తులు విరివిగా హాజరై స్వామి దర్శనం పొందారు.
ముందస్తుగా ఆలయ ప్రాంగణం దీపాలతో, పుష్పాలతో విశేషంగా అలంకరించబడగా, “స్వామి శరణం” నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. వేదఘోషల మధ్య గురుస్వాములు సంప్రదాయబద్ధంగా పడి పూజ నిర్వహించగా, భక్తులు భక్తి పరవశంతో స్వామిని దర్శించుకున్నారు. పూజ అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గోల్కొండ శ్రీకాంత్ గురు స్వామి మాట్లాడుతూ, “అయ్యప్ప పడి పూజ భక్తులను ఆధ్యాత్మిక దిశలో నడిపించే ఒక పవిత్ర కార్యక్రమం. స్వామి అయ్యప్ప అనుగ్రహంతో ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొనాలి” అని ఆశీర్వచనాలు అందించారు.
పూజ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత జీవన్ గౌడ్ మాట్లాడుతూ, “ఉప్పర్ పల్లిలో ఇంత ఘనంగా అయ్యప్ప పడి పూజ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం, గురుస్వాముల సేవా భావం నిజంగా ప్రశంసనీయమైనవి. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతిని, ఐక్యతను పెంపొందిస్తాయి. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి కుటుంబాలు అభివృద్ధి పథంలో నడవాలి” అని జీవన్ గౌడ్ అన్నారు.
