పోలీస్ స్టేషన్ల విభజన ప్రతిపాదనను రద్దు చేయాలి: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు అఖిల పక్షం వినతి
ఇది కద నిజం,సికింద్రాబాద్: తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చాలనే ప్రతిపాదనపై అడ్డగుట్ట అఖిల పక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మార్పు వల్ల స్థానిక ప్రజలకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంటూ, మంగళవారం సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. పరిపాలన సౌలభ్యం పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు. వినతి పత్రం అందించిన వారిలో అఖిల పక్ష నేతలు ఎస్.యాదగిరి, నక్క మధు, ఆర్.మల్లేష్, నర్సింగ్ రావు, మనోహర్, హంసరాజు, చందర్, శ్రీధర్ గౌడ్, శ్రీరామ్ నాయక్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భౌగోళికంగా మరియు రవాణా పరంగా తుకారాం గేట్ స్టేషన్ పరిధిలోనే ఉండటం తమకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు. అఖిల పక్ష నేతల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రజల సౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకుని, శాంతిభద్రతల పరిరక్షణలో ఇబ్బందులు కలగకుండా తగిన నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
