*పోలీసింగ్‌లో సరికొత్త అధ్యాయం: బాధితుడి ముంగిటకే ఎఫ్‌ఐఆర్*
సైబరాబాద్ పోలీసుల వినూత్న చొరవ – స్టేషన్ల చుట్టూ తిరిగే పనిలేకుండా ఇంటికే సేవలు
ఇది కద నిజం:ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేస్తూ, ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’కు సరికొత్త అర్థం చెబుతున్నారు సైబరాబాద్ పోలీసులు. బాధితులు ఎఫ్‌ఐఆర్ (FIR) కాపీ కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పోలీసులే నేరుగా బాధితుల వద్దకు వెళ్లి ఎఫ్‌ఐఆర్ అందజేసే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు బాలానగర్ పోలీసులు ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
బాలానగర్ పరిధిలోని ఓ పరిశ్రమలో దొంగతనం జరిగినట్లు యజమాని జి. సాంబమూర్తి ‘డయల్ 100’కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన బాలానగర్ సీఐ నర్సింహా రాజు, కేసు నమోదు చేయడమే కాకుండా.. స్వయంగా తన సిబ్బందితో కలిసి సదరు పరిశ్రమ వద్దకు వెళ్లారు. బాధితుడికి అక్కడికక్కడే ఎఫ్‌ఐఆర్ కాపీని అందజేసి భరోసా కల్పించారు.
“పోలీసులంటే భయం పోగొట్టి, బాధితుల్లో ధైర్యం నింపడమే మా లక్ష్యం. ఇకపై సామాన్యులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే పని లేకుండా, సేవలే వారి వద్దకు వస్తాయి.” బాలానగర్ సీఐ నర్సింహా రాజు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినోద్ కుమార్, ఏఎస్ఐ హనుమయ్య, హెచ్‌జీ మల్లేష్ పాల్గొన్నారు. పోలీసుల తక్షణ స్పందన మరియు వినూత్న పనితీరుపై బాధితుడు సాంబమూర్తి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
